Sunday, February 27, 2011

February- Black History Month.

సప్త ఋషి మండలం, ఉత్తరపు నక్షత్రం...
దిక్కుచాటుతూ ,దారి చూపెడుతుండగా...
వేటకుక్కలు వెంట తరుముతూ  
తోడేళ్ళలాంటి మనుషులు తుపాకి పట్టి వేటాడుతుండగా 
వెనుక నుండి ప్రాణభయం మిమ్మల్ని ముందుకు నెట్టగా 
ముందు నుండి స్వేచ్చా జీవనం మిమ్మల్ని మునుముందుకు లాగగా
మీరు మోసిన బరువులు,బాధలే మీకు బలం కాగా 
మీ కోసం, మీ భావి తరాల కోసం 
మానవాళికీమాత్రం మానవత్వం మిగల్చటం కోసం 
మీరు చేసిన ప్రయత్నం, మీరు చేసిన త్యాగం, 
అందుకు మీకివే నా జోహారులు.
రాత్రికి రాత్రి, చలిలో, చీకట్లో 
అడవిలో, ఆకలితో 
మైళ్ళకి మైళ్ళు పరిగెత్తిన
ఆశా జీవుల్లారా
నీళ్ళల్లో ఈదీ, ముళ్ళ తుప్పల్లో తల దాచుకునీ,
అలసటతో, అనారోగ్యంతో ఒడలు సడలినా  
మనసు సడలని సంకల్పంతో 
ముందుకేగి, గమ్యం చేరి,
ప్రపంచానికి స్వేచ్చని నిర్వచించిన 
ఓ ఋషుల్లారా
అణగారిన ఆర్తుల ఆశయాల ఆకాశంలో 
నేడు మీరు ధ్రువ తారలు.



(నా చిన్నారి జాహ్నవి తన school library నించి తెచ్చి, 
Mrs. Hariet tubman గురించి వివరించి చెప్పి,
నా చేతికిచ్చిన పుస్తకం చదివిన, నా స్పందన.)


No comments:

Post a Comment